సంఘ్ @100 - పంచ పరివర్తన
భారత జాతిని, భారత ప్రజలను భారతమాత రూపంగా మరియు భారతదేశాన్ని తమ మాతృభూమి గా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడం ఆశయంగా డాక్టర్ కేశవ బలిరాం హెగ్డేవార్ (డాక్టర్ జి) చేత 1925 వ సంవత్సరములో విజయదశమి రోజున నాగపూర్ లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ( ఆర్ఎస్ఎస్) వంద వసంతాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నది. శతాబ్ది ఉత్సవాలను కూడా భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలిపే దానికి ప్రణాళిక చేయటం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల సంఘ్ నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కుటుంబ సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణ ,స్వదేశీ ఉత్పత్తుల వినియోగం ,పౌర విధులు- చట్టాల పాటింపు, మరియు సామాజిక సమరసత వంటి పంచ పరివర్తనాల ద్వారా సంఘ్ స్వయం సేవకులతో పాటు ప్రజలలో నైతిక చింతన, పకృతి అనుకూల జీవనశైలి, కుటుంబ విలువలు, స్వదేశీయతను బలపరచటం మొదలైన విషయాల పై విస్తృతమైన ప్రచారం చేయటం ద్వారా భారతీయ సమాజాన్ని సరియైన మార్గంలో పయనించే దానికి విశ్వప్రయత్నం చేస్తుండటం ఎంతైనా ముదావహం. ఈ పంచ పరివర్తనాల లో మొదటిదైన కుటుంబ సౌభ్రాతృత్వం ద్వారా కుటుంబంలో ప్రేమ, గౌరవం, సహకారం , సాంప్రదాయ విలువలు , పెద్దలను గౌరవించడం ,చిన్న వారిని ఆదరించటం వంటి ప్రవర్తనలు దేశ ప్రజలను మన సంస్కృతిలో నిక్షిప్తం గా ఉంచేదాని కి దోహదం చేస్తాయి. నేటి ఆధునిక కాలంలో జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా భారతీయ కుటుంబ వ్యవస్థ క్రమక్రమంగా బలహీనపడుతున్నది. కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అనుబంధాలు,ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. తల్లిదండ్రులు ,భార్య భర్తలు, సోదర సోదరీమణులు, మిత్రులు, గురువులు మరియు ప్రజల మధ్య సంబంధాలలో పరస్పర బాధ్యత, ప్రేమ, గౌరవం, నమ్మకం అవసరం. కొంతమంది యువత పెళ్లి ని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు, ఇది కుటుంబ వ్యవస్థకు మరియు సమాజ స్థిరత్వానికి ప్రమాదం కలిగిస్తుంది. రెండవది అయిన పర్యావరణ పరిరక్షణ ద్వారా ఇంటి నుండే నీటి పొదుపు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం, సహజ వనరులు వాడటం లో పొదుపు, చెట్లను పెంచడం, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత మొదలైనవి సమాజంలో మంచి ఆరోగ్యాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. మన చుట్టు ప్రక్కల ఉండే వాతావరణమే పర్యావరణం. పంచభూతాలను సంరంక్షించటం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
మూడవ దైన స్వదేశీ ఉత్పత్తుల వినియోగం దేశీయ ఉత్పత్తుల వాడకాన్ని పెంచడం, తప్పనిసరి పరిస్థితులలో తప్పితే విదేశీ వస్తువులు వాడకపోవడం, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించటం , కుటీర పరిశ్రమలను ఆదుకోవటం వంటివి భారతదేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. భారతదేశం ఆర్థికంగా బలపడుతున్న ఈ సందర్భంలో విదేశీ శక్తులు భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే దానికి చేస్తున్నటువంటి కుయుక్తులను మనం ఈనాడు చూస్తున్నాం కానీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం దీనిని ఎప్పుడో ఊహించి పంచపరివర్తన లో స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని చేర్చటం భారతదేశ ఆర్థిక వ్యవస్థ పై సంఘ్ ముందు చూపు తెలియజేస్తుంది. స్వదేశీ ఉత్పత్తులను వినియోగించడం ద్వారా గ్రామాల యొక్క వికాసం సాధ్యమవుతుంది తద్వారా దేశం కూడా వికసిస్తుంది. నాలుగవ దైన పౌర విధులు మరియు చట్టాల పాటింపు ద్వారా ప్రతి పౌరుడు తప్పనిసరిగా చట్టాలను గౌరవించడం, దేశం పట్ల భక్తి, గౌరవం ,బాధ్యతలు కలిగి ఉండటం ముఖ్యంగా విదేశీ వ్యామోహంలో ఉన్న యువత భారత దేశ రాజ్యాంగం మరియు చట్టాలపై గౌరవం పెంపొందించడానికి ఎంతైనా చైతన్యం కలిగిస్తుంది. భారత రాజ్యాంగం పౌరుల కర్తవ్యాలు ,హక్కులు ,నైతిక మార్గదర్శకత, దేశ సంస్కృతి పై ప్రజల ఆరాధన, పూర్వీకుల పై గౌరవం ,సత్యం, అహింస మొదలైన ప్రాథమిక సూత్రాలను నిర్దేశిస్తుంది. ఐదవ పరివర్తన సామాజిక సమరసత ద్వారా కుల ,మత, భాష, ప్రాంత భేదాలను తొలగించటం, సమానత్వాన్ని,ఐకమత్యాన్ని, మానవత్వాన్ని ప్రోత్సహించటం ద్వారా ఇంటి నుంచే మార్పు మొదలవుతుంది ,అదే దేశానికి మార్గాన్ని చూపుతుంది అనే సందేశాన్ని ఇస్తుంది. సామాజిక సమరసత అనేది వ్యక్తిగత, కుటుంబ, నివాస మరియు పనిచేయు ప్రదేశాలలో మొదలై దేశములో ప్రజల మధ్య సౌహార్ధ భావాన్ని, ఐకమత్యాన్ని తీసుకొని వచ్చి జాతీయ సమైక్యతను కాపాడుతుంది. ప్రతి వర్గం వారి ప్రయోజనాల కోసం మాత్రమే పోరాడుతున్న ది,ఇది చాలా దురదృష్టకరం ,సమాజంలోని అన్ని వర్గాలు, మతాలు సమాన హక్కులు పొందాలి అనేదే సంఘ్ సిద్ధాంతం. దేశంలో ప్రజల మరియు మతాల మధ్య ఆచారాలు, సాంప్రదాయాలు పరస్పర గౌరవంతో కొనసాగాలి.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చూపుతున్న ఈ పంచ పరివర్తన లు వ్యక్తిగత జీవిత మార్పు నుంచి సామాజిక మార్పుకు దారి తీసే ఒక చైతన్య ప్రేరణలు. భారతీయ సంస్కృతిలో మాత్రమే లిఖించబడిన వసుదైక కుటుంబం మరియు సర్వేజనా సుఖినోభవంతు అనే భావనను విశ్వవ్యాప్తము చేయటమే ఈ పంచ పరివర్తనల సదుద్దేశం.
ఆచార్య వై.వి .రామిరెడ్డి
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
తిరుపతి
( విజయదశమి , ఆర్ఎస్ఎస్ శతాబ్ది దినోత్సవం సందర్భంగా)
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.